- త్వరలో కొత్త ఆర్‌వోఆర్చట్టం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఆమనగల్లు, వెలుగు:అక్టోబర్ నెలాఖరులోగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఆరు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల ఇండ్లు ఇస్తామని, ఇంటి స్థలం లేని వారికి స్థలంతో పాటు రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో నిర్మించిన తహసీల్దార్ ఆఫీస్ ను సోమవారం ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన మీటింగ్ లో మంత్రి మాట్లాడారు. పదేండ్ల బీఆర్ ఎస్ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఆర్ వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి రైతుకు తన పొలంపై హక్కు ఉండేలా భరోసా కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న స్మార్ట్ కార్డు ద్వారా రేషన్ , హెల్త్, పింఛన్లతో పాటు అన్ని ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అర్హులైన పేదలకు డిసెంబర్ లోగా భూ పంపిణీ పూర్తి చేసి, పాస్ బుక్స్ ఇస్తామన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత బీఆర్ ఎస్ ప్రభుత్వం రూ. 7.19 లక్షల అప్పల్లోకి నెట్టిందన్నారు. వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో సైతం రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతిపక్షాలు కాకిగోల చేస్తున్నాయని, చేసిన పనులు చెప్పడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్ , ఆర్డీవో ఆఫీస్ లకు సొంత బిల్డింగ్ లు నిర్మిస్తామన్నారు. అనంతరం గీతా కార్మికులకు కాటమయ్య కిట్లను, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టీఎఫ్ ఐడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్యుడు బాలాజీసింగ్ , కలెక్టర్ శశాంక్, నాయకులు శ్రీనివాస్ గౌడ్ , ప్రభాకర్ రెడ్డి, బిక్యానాయక్ , కిషన్ రెడ్డి, జగన్ పాల్గొన్నారు.