నష్టపోయిన రైతులను ఆదు కుంటాం

నష్టపోయిన రైతులను ఆదు కుంటాం

 

  •  ఇసుక మేటలు వేసిన ప్రతి ఎకరాకు 10 వేల పరిహారం

  • జీవాలకు 2 వేలు, పశువులకు 20 వేలు ఇస్తం

  •  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం/ అశ్వరావుపేట: వర్షాల కారణంగా  నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇవాళ అశ్వరావుపేట మండలంలోని పెద్ద చెరువుకు గండి పడిన ప్రాంతాన్నిమంత్రి పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చెరువుకు  గండి పడిందన్నారు. వరద నీరు భారీగా వస్తున్నప్పటికీ అధికారులు అంచనా వేయలేకపోయారని ప్రాజెక్టులోని మూడు గేటు ఇన్ టైంలో ఎత్తకపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. 

400 ఎకరాల్లో వరద ఉధృతితో ఇసుక మేటలు వేసిందని, వాటిని తొలగించుకునేందుకు రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున చెల్లిస్తామని అన్నారు. వరదల్లో కొట్టుకుపోయిన పశువు లకు ఒక్కొక్క దానికి రూ 20వేల రూపాయిలు  పరిహారం, మేకలు గొర్రెలు ఒక్కొక్క దానికి రూ. 3వేలు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. వరదల కారణంగా  శిథిలావస్థకు చేరిన ఇండ్లు కూలిపోయిన ఇండ్లు బాధితులకు సర్వే అనంతరం సెప్టెంబర్ లోపు ఇందిరమ్మ ఇండ్లు కట్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

తన తండ్రి పేర ఏర్పాటుచేసిన రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వరదలో చిక్కుకున్న పూరిగుడిసెలకు రూ 10,వేలు  స్లాబ్ ఉన్న ఇండ్లకు 5వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పెద్ద చెరువుకు గండిపడటంలో అధికారులు తప్పు ఉన్నట్లు తెలిస్తే శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఆయన వెంట అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పి రోహిత్ రాజు. ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.