
- దశలవారీగా పెండింగ్ సమస్యల పరిష్కారం: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: రిటైర్డ్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థ యాజమాన్యానికి సహకారం అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను దశల వారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగిన టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐదో వార్షిక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 90 యేండ్లు నిండిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం సన్మానించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థ మేలు కోసం రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు.
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం, సంస్థ పరిరక్షణ అంశాలే ప్రాధాన్యాలుగా సంస్థ ముందుకెళ్తున్నదని స్పష్టం చేశారు. కొత్త బస్సులకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలను చేపడుతున్నామన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టి సాధిస్తోందని, తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్ వన్ సంస్థగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్మాట్లాడుతూ.. రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులకు సంస్థపై ప్రేమ, అభిమానం ఎక్కువగా ఉంటుందని, వారు ఎప్పుడూ ఆర్టీసీ బాగు కోసం పరితపిస్తుంటారన్నారు. ఆర్టీసీ రెగ్యులర్ అధికారులు, సిబ్బందితోపాటు రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్టీసీ అధికారులు తమ సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగవేందర్ రావు, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, సెక్రటరీ విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ సీతారాంబాబు, ట్రెజరరీ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.