దమ్ముంటే టచ్ చేసి చూడండి.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం సవాల్

దమ్ముంటే టచ్ చేసి చూడండి.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం సవాల్

హైదరాబాద్: సెక్రటేరియట్ లో ఇవాళ ప్రారంభించబోయే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తామంటే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దమ్ముంటే ఒక్కసారి విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని సవాలు విసిరారు. సెక్రటేరియట్ కట్టే  సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ సర్కారు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తాము అందరినీ కలుపుకొని ముందుకు పోతామని ప్రజాప్రభుత్వంలో ఉద్యమకారులకు సముచిత స్థానం ఉంటుందని, అమరవీరుల కుటుంబాలకు సర్కారు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

 ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారన్నారు. ‘యువతకు రాజీవ్ ఆదర్శం.. ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అదృష్టం.. రాజీవ్ చిరస్మరణీయుడు’ అని కొనియాడారు. విగ్రహంపై అనవసర రాజకీయాలు చేయొద్దు అని సూచించారు. రాజీవ్‏పై మాట్లాడే వారికి ఆయనేంటో పుస్తకం పంపిస్తానని, చదువుకోవాలని సూచించారు. 

గణేశ్ నిమజ్జనానికి విస్తృతంగా ఏర్పాట్లు

మంత్రి పొన్నం ప్రభాకర్ అంతకు ముందు ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ట్యాంక్ బండ్‌ చుట్టూ 135, మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 300కు పైగా క్రేన్‌లు అందుబాటులో ఉంటాయని వివరించారు. నిమజ్జన ఉత్సవాలకు ప్రజలు సహకరించాలని కోరారు. వీలైనంత వరకు మంగళవారం రాత్రి లోపు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.