- 8, 9, 10 తరగతుల స్టూడెంట్స్ కు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ ఇవ్వాలి
- గ్రీన్ చానల్ ద్వారా మెస్ బకాయిలు రిలీజ్ చేస్తం
- అద్దె భవనాల్లోని గురుకులాలకు త్వరలో సొంత బిల్డింగ్స్
హైదరాబాద్ , వెలుగు: ఇంటర్నేషనల్ స్కూళ్లకు మించి తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయబోతున్నదని, ఇందు కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించిందని బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని గురుకులాల్లో ఈఏపీ సెట్, నీట్ కోచింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. బీసీ గురుకులాలు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండాలని, ఈ ఏడాది 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. మెస్ చార్జీల పెంపు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, గ్రీన్ చానెల్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు అదనపు కరికులం యాక్టివిటీస్పై దృష్టి సారించాలని.. 8,9,10 తరగతుల స్టూడెంట్స్ ఎన్ సీసీ, ఎన్ ఎస్ ఎస్, రెడ్ క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో రెండు అంశాల్లో పాల్గొనేలా ఫ్యాకల్టీ కృషి చేయాలన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని కుమ్రం భీమ్ భవన్ లో జరిగిన బీసీ సంక్షేమ శాఖ విసృత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి మీటింగ్ నిర్వహిద్దామన్నారు. గురుకులాల్లో ఏఎన్ఎం లు విధిగా విద్యార్థుల ఎత్తు , బరువులు కొలవడంతో పాటు రక్తహీనత లేకుండా చూడాలని ఆయన సూచించారు. గురుకులాల సమస్యలను ఎమ్మెల్యే, ఎంపీ, ఆ జిల్లా మంత్రి, ఎమ్మెల్సీల దృష్టికి తీసుకెళ్లాలని.. సమస్యల పరిష్కారానికి వారి నిధులు కేటాయించేలా కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకుపోవాలని చెప్పారు.
15 నుంచి 31 వరకు పేరెంట్స్-టీచర్స్ మీటింగ్
దసరా సెలవుల అనంతరం ఈ నెల 15 నుంచి 31 లోపు ప్రతి గురుకులంలో పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి, పేరెంట్స్ నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఫీడ్ బ్యాక్ అందించాలని మంత్రి పొన్నం అన్నారు. దసరా పండగ లోపు రెంటెడ్ గురుకుల భవనాలకు 50 శాతం అద్దె చెల్లిస్తామని, భవనాల్లో మౌలిక వసతులు కల్పించేలా వారితో మాట్లాడాలని సూచించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి గురుకులంలో బాక్స్ ఏర్పాటు చేసి ఆర్సీవోలు పరిశీలించాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులకు స్థల పరిశీలన చేయాలని, త్వరలోనే సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అన్ని గురుకులాల్లో ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్ల సమస్యను క్లియర్ చేస్తామని, ఈ విషయంలో ఆందోళన వద్దని మంత్రి సూచించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం మాట్లాడుతూ.. జిల్లా బీసీ డెవలప్ మెంట్ ఆఫీసర్ , అడిషనల్ బీసీ డెవలప్ మెంట్ ఆఫీసర్ పోస్టులు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.