- పాల ఉత్పత్తి పెరిగితేనే కల్తీ పాలకు చెక్: మంత్రి పొన్నం
ముషీరాబాద్, వెలుగు: పాడి పంటలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గోపాల మిత్రలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఆర్టీసీ కళాభవన్ లో రాష్ట్ర గోపాల మిత్రల సంఘం ఆధ్వర్యంలో మంత్రికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గోపాల మిత్రలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
వచ్చే నెల మొదటి వారంలోపే దీనిపై సీఎంతో చర్చిస్తానన్నారు. తాను కూడా రైతు బిడ్డనే అని, ఎంపీగా ఉన్నప్పుడు కూడా పశువులను పెంచానని తెలిపారు. ఇప్పుడు కూడా వ్యవసాయం, పశు పోషణ పట్ల గౌరవం ఉందన్నారు. ప్రభుత్వానికి, గోపాల మిత్రలకు వారధిగా ఉంటానన్నారు. గోపాల మిత్రలు లక్షలాది పశువుల ఆరోగ్యం కోసం బాగా పని చేస్తున్నారని, వారి శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టేలా చూస్తానన్నారు. గౌరవ వేతనం పెంపు, దశలవారీగా వెటర్నరీ డాక్టర్ సహాయకులుగా నియామకాలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా పాలు కల్తీ అవుతున్నాయని, కల్తీ పాలతో పిల్లలు ఎదగాల్సిన వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. పాల ఉత్పత్తి పెరిగితేనే కల్తీ సమస్యను అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో పశు గణాభివృద్ధి సంస్థ సీఈవో మల్లీశ్వరి, రిటైర్డ్ ఐఏఎస్ ఎంవీ రెడ్డి, వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ బాబు, ఇతర అధికారులు, గోపాల మిత్రల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.