రంజాన్ నెలలో ఇబ్బందులు రావొద్దు.. రంజాన్ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ

రంజాన్ నెలలో ఇబ్బందులు రావొద్దు.. రంజాన్ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 2వ తేదీ నుంచి స్టార్ట్ కానున్న రంజాన్ మాసంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం ఆయన సెక్రటేరియెట్ లో హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేలు, అధికారులతో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..ఈద్గాలు, మసీదుల వద్ద హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.

రంజాన్ నెలలో ముస్లిం సోదరులకు సమయానికి రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. షాపింగ్ కోసం అర్ధరాత్రి వరకు వీధి వ్యాపారాలు కొనసాగించడానికి అనుమతించాలని పోలీస్ అధికారులను, సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ మళ్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 

సాయంత్రం 4 గంటల వరకే డ్యూటీ
రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి పొన్నంకు అధికారులు తెలిపారు. మసీదు ,ఈద్గాల వద్ద ప్రత్యేక శానిటేషన్ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీలోని రోడ్ల మరమత్తులు పూర్తి చేస్తామని, మక్కా మసీద్ , రాయల్ మాస్క్, మీరాలం ఈద్గా వద్ద ప్రత్యేక చర్యలు చేపడతామని వివరించారు.  రంజాన్ నెలలో మొబైల్ ట్రాన్స్ ఫార్మార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పండగ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన  చేస్తున్నామని మంత్రికి  అధికారులు చెప్పారు. సమావేశంలో  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మహ్మద్ బిన్ అహ్మద్ బలాల, కౌసర్ మొయినుద్దీన్, ఎమ్మెల్సీ అమేర్ ఆలీ ఖాన్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శివరాత్రికి అదనపు బస్సులు నడపండి

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన శివాలయాలకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్  ఆదేశించారు. మంగళవారం ఆర్టీసీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.