అల్వాల్ ​వరకు మెట్రోను విస్తరిస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్

  • ఎలివేటెడ్ ​కారిడార్​కు సమాంతరంగా మెట్రో లైన్​ను పొడిగిస్తాం

కంటోన్మెంట్, వెలుగు: అల్వాల్​వరకు మెట్రో లైన్​ను విస్తరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎలివేటెడ్​ కారిడార్​ ప్రాజెక్టుకు సమాంతరంగా జేబీఎస్​నుంచి అల్వాల్​వరకు మెట్రో పనులు చేపడతామన్నారు. శుక్రవారం ఆయన కంటోన్మెంట్​ఎమ్మెల్యే శ్రీగణేశ్​తో కలిసి త్వరలో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం కంటోన్మెంట్ సిక్కు విలేజ్ లోని దోబీ ఘాట్ గ్రౌండ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఎలివేటెడ్ కారిడార్​పూర్తయితే కరీంనగర్ తోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ట్రాఫిక్​కష్టాలు తప్పుతాయని చెప్పారు.

డిఫెన్స్, రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్​తో ఎలివేటెడ్​కారిడార్​కు అడుగులు పడ్డాయన్నారు. ఈ ప్రాజెక్టుపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్ష నాయకులకు సూచించారు. దోబీ ఘాట్ గ్రౌండ్ ను స్పోర్ట్స్ అథారిటీ తరఫున అభివృద్ధి చేస్తామని చెప్పారు. సమగ్ర ఇంటింటి కుటంబ సర్వే కోసం వస్తున్న ఎన్యుమరేటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

అలాగే లాలాగూడలోని రైల్వే మెకానిక్ వర్క్ షాప్ వద్ద ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయ్స్​సంఘ్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్​శుక్రవారం సందర్శించారు. రైల్వే యూనియన్ నేతలు, కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. డిసెంబర్ 5న సౌత్ సెంట్రల్ రైల్వే ఎన్నికల్లో మర్రి రాఘవయ్య ప్యానెల్ నుంచి కాంగ్రెస్​నాయకుడు ఆదం సంతోశ్​పోటీ చేస్తున్నారని, గెలిపించాలని కోరారు.