గణేశ్​ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయండి.. మంత్రి పొన్నం

గణేశ్​ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయండి.. మంత్రి పొన్నం
  • సెప్టెంబర్ 7న ప్రతిష్ఠ.. 17న నిమజ్జనం
  • రోడ్లపై గుంతలు పూడ్చేయాలని ఆదేశం
  • మట్టి విగ్రహాల ప్రతిష్ఠపై అవగాహన కల్పించండి:మంత్రి శ్రీధర్ బాబు
  • అధికారులతో వినాయక ఉత్సవాల సన్నాహక సమావేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గణేశ్​ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆయా జిల్లాల ఇన్​చార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వినాయక ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘‘సెప్టెంబర్ 7న వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తాం. 17వ తేదీన నిమజ్జనం ఉంటది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. విద్యుత్, ట్రాన్స్​పోర్ట్, ఆర్టీసీ, మెట్రో, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి. నిరుడుతో పోలిస్తే ఈసారి 10శాతం విగ్రహాలు పెరుగుతయ్. మూడు కమిషనరేట్ల పరిధుల్లో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉండాలి.

భాగ్యనగర్, ఖైరతాబాద్, బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకున్నం. ఖైరతాబాద్ వినాయకుడు పూర్తిగా నిమజ్జనం అయ్యేలా ఏర్పాట్లు చేయండి. లేకపోతే ఆ తర్వాత వచ్చే విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులు వస్తయ్’’అని పొన్నం అన్నారు.

ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చూడండి

రోడ్లపై ఉన్న గుంతలన్నీ పూడ్చేయాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ‘‘నిమజ్జనానికి సంబంధించిన వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలి. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. 11 రోజుల పాటు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలి’’అని పొన్నం అన్నారు. ఏర్పాట్ల గురించి హెచ్​ఎండీఏ కమిషనర్ మంత్రులకు వివరించారు. ‘‘ట్యాంక్​బండ్, ఎన్టీఆర్ మార్గ్​లో విగ్రహాల నిమజ్జనానికి 22 ప్లాట్​ఫామ్​లు ఏర్పాటు చేస్తున్నం. 33 క్రేన్లు ఉపయోగిస్తాం. అవసరమైతే మరిన్ని క్రేన్లు తీసుకొస్తం.

జీహెచ్​ఎంసీ పరిధిలో 100 స్టాటిస్టిక్ క్రేన్స్, 150 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేస్తున్నం. 10,500 శానిటేషన్ వర్కర్లు  నిమజ్జన ప్రాంతంలో ఉంటరు. వెస్టేజ్ తొలగించేందుకు 100 టిప్పర్లు, 20 జేసీబీలు ఉపయోగిస్తున్నం’’అని వివరించారు. ఖైరతాబాద్ వద్ద భక్తుల రద్దీ మేరకు అర్ధరాత్రి దాకా మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రులకు అధికారులు వివరించారు. 

మట్టి విగ్రహాలనే పూజించండి: శ్రీధర్​బాబు

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మట్టి విగ్రహాలనే పూజించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. ‘‘మట్టి విగ్రహాలను ఎండోమెంట్ అధికారులు అందుబాటులో ఉంచాలి. స్కూల్స్, కాలేజీల్లో మట్టి విగ్రహాల ప్రతిష్ఠతో కలిగే లాభాలపై అవగాహన కల్పించాలి.

ఏడు జోన్ల పరిధిలో జోనల్ కమిషనర్, డీసీపీలంతా మండపాల నిర్వాహకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాలి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సూచనలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తాం’’అని శ్రీధర్ బాబు అన్నారు. రోడ్లకు మరమ్మతులు చేపడ్తామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ఐదు రూపాయల భోజనం అందించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.