-
సామరస్యంగా విభజన సమస్యలు పరిష్కరిస్తం
-
శ్రీశైలం టెంపుల్లో మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 2లక్షల రుణమాఫీ ఈనెలలో పూర్తి చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే లక్షన్నర వరకు ఉన్న రుణాలను పూర్తి చేశామన్నారు. టెక్నికల్ సమస్యలతో పెండింగ్ లో పడిన రైతుల రుణమాఫీని కూడా పూర్తిచేస్తామని వెల్లడించారు. సోమవారం శ్రావణమాసం సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి శ్రీశైలానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి, శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు ఏసీ బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహాలక్ష్మి స్కీమ్ కు మంచి ఆదరణ వచ్చిందని, బస్సు సౌకర్యం లేని గ్రామాలకు, మండలాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. హైదరాబాద్ లో మొత్తం ఎలక్ర్టిక్ బస్సులే నడిపేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
ఇద్దరు కేంద్ర మంత్రులున్నా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలుగు రాష్ర్టాల మధ్య ఉన్న విభజన, ఉద్యోగుల సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని దేవున్ని ప్రార్థించినట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు.