- స్టూడెంట్ల ఆరోగ్యానికి ప్రాధాన్యం: మంత్రి పొన్నం
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
- బీసీ గురుకులాలపై అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: గురుకుల స్కూల్స్‌లో ఏమైనా సమస్యలుంటే వెంటనే సెక్రటరీ దృష్టికి తీసుకురావాలని ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్, వార్డెన్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మంత్రి, ఉన్నతాధికారులు వెంటనే సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 325 మంది బీసీ గురుకుల స్కూల్స్ ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్, వార్డెన్లతో మంత్రి పొన్నం, సెక్రటరీ సైదులు ఆదివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
గురుకుల స్కూల్ స్టూడెంట్ల హెల్త్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. పరిసరాల పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత తప్పనిసరి పాటించాలి. లేకపోతే అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సొంత భవనాలు ఉన్న 21 గురుకుల పాఠశాలల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం.
అన్ని గురుకులాలకు కలిపి ఒకే ఫుడ్ మెనూ రెడీ చేయాలి. దీనిపై అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలి. స్టూడెంట్ అనారోగ్యం బారినపడితే వెంటనే ట్రీట్మెంట్ అందించాలి. విద్య, ఆహారం నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేశాం. రానున్న పబ్లిక్ ఎగ్జామ్స్‌లో మంచి ఫలితాలు సాధించేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేయాలి’’అని మంత్రి పొన్నం ఆదేశించారు.
విగ్రహావిష్కరణ ప్రోగ్రామ్‌కు హాజరుకాలేనన్న బండి సంజయ్
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు మంత్రి పొన్నంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి చెప్పారు. పని ఒత్తిడి కారణంగా స్వయంగా కలవలేకపోతున్నట్లు వివరించారు. ఆహ్వాన పత్రిక కూడా అందిందని తెలిపారు. కాగా, ప్రజా పాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రోగ్రామ్‌లో పాల్గొనాల్సిందిగా ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఓవైసీకి అధికారుల ద్వారా ఆహ్వాన పత్రిక పంపించామన్నారు. ఆయన ఇంకా అందుబాటులో రాలేదని తెలిపారు.
‘మదర్ ఆఫ్ ది సాయిల్’ (తెలంగాణ తల్లి) పుస్తకావిష్కరణ
ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష.. కేవలం సోనియా గాంధీ దృఢ నిశ్చయం వల్లే సాధ్యమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ దేవత అని కొనియాడారు. సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం నారగౌని రాసిన ‘‘మదర్ ఆఫ్ ది సాయిల్’’ పుస్తకాన్ని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆదివారం పొన్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రజల ఆశయాలను సాకారం చేయడానికి సోనియా గాంధీ చూపించిన పట్టుదల రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతది. కాంగ్రెస్ పార్టీ త్యాగం, సోనియా నాయకత్వం కారణంగానే రాష్ట్ర కల సాకారం అయ్యింది. పార్టీ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేం. సోనియా ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తం. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడుతున్నరు. మహిళా సాధికారతపై దృష్టిపెట్టినం’’అని పొన్నం తెలిపారు.