మూసీపై అవకాశవాద రాజకీయాలు వద్దు...బీజేపీ లీడర్లకు మంత్రి పొన్నం సూచన

మూసీపై అవకాశవాద రాజకీయాలు వద్దు...బీజేపీ లీడర్లకు మంత్రి పొన్నం సూచన

సియోల్ నుంచి వెలుగు ప్రతినిధి: మూసీపై అవకాశవాద రాజకీయాలు చేయొద్దని బీజేపీ లీడర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ సూచించారు. మూసీ పునరుజ్జీవం వల్ల నిర్వాసితులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై బీజేపీ నేతలు లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి సూచనలు చేయాలని, వాళ్లను రెచ్చగొట్టడం లాంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. నిర్వాసితుల తరఫున బీజేపీ చేసే ప్రతిపాదనల్లో ఏ మాత్రం న్యాయమున్నా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పారు. సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం బుధవారం అక్కడ మీడియాతో మాట్లాడారు.

బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మూసీ సందర్శన పేరిట రాజకీయాలు చేయడం ఆపి, అక్కడి ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. సియోల్ పర్యటన తర్వాత నిర్వాసితులకు అన్యాయం జరగకుండా ఏ విధమైన పునరావాసం కల్పించాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. బీజేపీ నేతలు నిజంగా తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారే అయితే మూసీ పునరుజ్జీవానికి సహకరించాలని, ధర్నాలు, నిరసనల పేరు మీద మొసలి కన్నీరు కార్చడం సరికాదన్నారు.