బీజేపీ అభివృద్ధి చేయకుండా అక్షింతల పేరుతో రాజకీయం చేస్తోంది : మంత్రి పొన్నం ప్రభాకర్ 

బీజేపీ అభివృద్ధి చేయకుండా అక్షింతల పేరుతో రాజకీయం చేస్తోంది : మంత్రి పొన్నం ప్రభాకర్ 

బీజేపీ అభివృద్ధి చేయకుండా అక్షింతల పేరుతో రాజకీయం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.  ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షల రూపాయలు వేస్తామని.. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ  మోసం చేసిందన్నారు.  జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామ చౌరస్తాలోని కార్నర్ మీటింగ్లో పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుకు మద్దతుగా ఆయన  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

బండి సంజయ్ తండ్రి టీచర్గా పనిచేసాడట. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసాడట. ఏది నిజమో చెప్పాలని బండి సంజయ్ని పొన్నం ప్రశ్నించారు.  దేశ సంపదను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. దేశమంతా అంబేద్కర్ విగ్రహాలను తీసేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆలోచనలో బీజేపీ ఉందన్నారు.  కరీంనగర్ ఎంపీగా తానున్నపుడు చేసిన అభివృద్ధి తప్ప... బండి సంజయ్, వినోద్ కుమార్ చేసిందేమీ లేదని విమర్శించారు. 

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ఐదింటిని అమలు చేశామన్నారు మంత్రి పొన్నం.  ఆగస్టు 15 లోపు రూ. 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.  వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు.  కరీంనగర్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలం గెలిచామని...  ఎంపీగా వెలిశాలను గెలిపిస్తే ఐదుగురం కలిసి కరీంనగర్ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.