హైదరాబాద్​కు రూపాయి ఇవ్వలె : పొన్నం ప్రభాకర్

  •  కేంద్ర బడ్జెట్​పై అసెంబ్లీలో  పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మత రాజకీయాలు చేసి బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్రబడ్జెట్ లో హైదరాబాద్ సిటీకి రూపాయి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం చేశారో చెప్పాలన్నారు. అసెంబ్లీలో కేంద్రబడ్జెట్ పై పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీది ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్టుగా ఉందన్నారు. పదేండ్లు  బాగా కొట్లడినం అంటున్న బీఆర్ఎస్.. బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలిపిందని విమర్శించారు.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎన్నడైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయారా అని  ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని వెల్లడించారు. రాష్ట్రానికి నిధులు కావాలంటే బీజేఎల్​పీ నేత మహేశ్వర్ రెడ్డి.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని కోరారు. బీజేపీ నేతలకు తెలంగాణ పౌరుషం ఉందా, లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి బడ్జెట్ లో అన్యాయం జరిగితే వారు కనీసం మాట్లాడటం లేదని పేర్కొన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ కుర్చీని కాపాడుకునే విధంగానే  ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్, బిహార్ కు నిధులు ఇచ్చారు తప్పితే, తెలంగాణ పేరు కూడా ఎత్తలేదని వెల్లడించారు. ఐదేండ్లు ఎంపీగా, ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ సిరిసిల్లకు ఏం చేస్తారో చెప్పాలన్నారు.