కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎవరు ఎవరిని తొక్కుతారో చూసుకుందాం రా అంటూ సవాల్ విసిరారు . కేసీఆర్ అసహ్యమైన భాష చూస్తుంటే సిగ్గుగా ఉందన్నారు. కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేనేత కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్నారు.కేటీఆర్ అత్తగారి ఊర్లో సమస్యలు పరిష్కరించని నీచ చరిత్ర కేటీఆర్ దేనన్నారు. అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమన్నారు.
పార్లమెంట్ లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదు: జూపల్లి
తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహానికి వెయ్యి గజాల లోతులో పాతిపెట్టాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పంట నష్టంపై మాట్లాడుతున్న కేసీఆర్ ఆనాడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క రైతుకు అయినా నష్ట పరిహారం ఇచ్చారా?..గతంలో కాంగ్రెస్.. పంట నష్టం ఇచ్చి కరువు రైతులను ఆదుకుందని చెప్పారు. పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్.. పాలమూరుకు ఏం చేశారో చెప్పాలన్నారు. మిషన్ భగీరథలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు .ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన నీచుడు కేసీఆర్ అని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్త పాలన సాగిందన్నారు మంత్రి జూపల్లి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ కు రాదన్నారు. కేసీఆర్ అవినీతికి సాక్షం కవిత జైలులో ఉండటమే కారణమన్నారు. 4 వేల పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు.