హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్ ఇలంబరితి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డితో కలిసి గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతిపై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామన్నారు.
రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఎనిమిదేండ్లలో మార్పులు, చేర్పుల కోసం రెండు లక్షల దరఖాస్తులు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వాటిని కూడా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, వెంకన్న, ఉపేందర్ రెడ్డి, రవికిరణ్, అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, శివకుమార్ నాయుడు పాల్గొన్నారు.