
కోహెడ(హుస్నాబాద్)వెలుగు: పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో మహా శివరాత్రి సందర్బంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా ప్రతి శివరాత్రికి ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటరన్నారు.
భక్తులకు శాశ్వత డ్రింకింగ్వాటర్తో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. స్వామి కృపతో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు పూర్తయి రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని , ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు. కోహెడ మండలం గొట్లమిట్టలో శ్రీ వరసిద్దలింగేశ్వర స్వామి, హుస్నాబాద్‌లోని సిద్దేశ్వర ఆలయం, అక్కన్నపేట మండలం కేశవపూర్ లో శ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి వెంట మానకొండూర్ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మెన్శివయ్య తదితరులు ఉన్నారు.