జూన్ ​2 నుంచి భూభారతి అమలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

జూన్ ​2 నుంచి భూభారతి అమలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: జూన్2 నుంచి క్షేత్ర స్థాయిలో భూభారతి అమలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో నిర్వహిస్తున్న రైతుల అవగాహన సదస్సులో కలెక్టర్​మనుచౌదరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధరణి వచ్చిన తర్వాత భూముల పంచాయితీ పెరిగిందన్నారు. భూభారతి చట్టం అమలైతే భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదని, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందన్నారు. 

ధరణిలో 30 ఏళ్ల కింద అమ్మిన భూమి మళ్లీ పాత యజమాని పేరు వచ్చిందని దీంతో గొడవలు మొదలయ్యాయన్నారు. అందుకే అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా  కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. త్వరలోనే గౌరవెల్లి కాల్వలను పూర్తి చేసి ప్రాజెక్టు ద్వారా నీళ్లందిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్​అబ్దుల్​హమీద్, జిల్లా లైబ్రరీ చైర్మన్​లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, ఆర్టీఏ మెంబర్​సూర్యవర్మ, పీఏసీ చైర్మన్​శివ్వయ్య ఉన్నారు. 

భూభారతితో రైతుల భూములకు భద్రత

నిజాంపేట: భూభారతి చట్టంతో రైతుల భూములకు భద్రత లభిస్తుందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం నిజాంపేట మండల కేంద్రంలోని  రైతు వేదికలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ధరణి ద్వారా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, ఇప్పుడు భూభారతితో అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించడానికి అవకాశం ఉందన్నారు.

 భూ సమస్యలపై రైతులు మీ-సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ నెల 29న జిల్లావ్యాప్తంగా భూభారతి అవగాహన సదస్సులను పూర్తిచేస్తామని, మే 1న జిల్లాలోని ఒక మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించుకుంటామని, జూన్ మొదటి వారంలో భూభారతి చట్టం అమల్లోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీవో రాజిరెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ సోమలింగారెడ్డి, ఎంపీవో ప్రవీణ్ పాల్గొన్నారు.