బ్రహ్మోత్సవాలకు అందరూ సహకరించాలి : పొన్నం ప్రభాకర్​

కరీంనగర్ సిటీ, వెలుగు: శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రాజకీయాలకతీతంగా అందరూ సహకరించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు కరీంనగర్ మార్కెట్ రోడ్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న వేంకటేశ్వర స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, నిర్వాహకులతో  మంత్రి  సమీక్షించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతి ఇంటికి ఆహ్వానం అందేలా చూడాలన్నారు. శోభాయాత్రలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా,  విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.  అంతకుముందు మార్కెట్ రోడ్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.5 లక్షలు విరాళంగా అందించారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్ఓ పవన్ కుమార్, డీఎఫ్ఓ బాలామణి, ఆర్డీవో మహేశ్వర్, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో లలితాదేవి పాల్గొన్నారు.