హుస్నాబాద్, వెలుగు : రాష్ట్రంలోనే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్‌మోడల్‌గా నిలుపుతానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్‌లోని ఐవోసీ బిల్డింగులో నియోజకవర్గ అభివృద్ధిపై సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు మనుచౌదరి, పమేలా సత్పతి, ప్రావీణ్యతో పాటు అడిషనల్ కలెక్టర్లు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల పదవీకాలం పూర్తయినందున అధికారులే ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న చేనేత, వ్యవసాయ ఆధారిత రంగాలతో పాటు పలు పథకాలను రైతులు, పేద వర్గాలకు అందేలా చొరవ చూపాలన్నారు. నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రింకింగ్‌వాటర్, ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతులపై రూట్ మ్యాప్ తయారుచేయాలని ఆదేశించారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమల కల్పనకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. అన్నిరకాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించాలని, ఇందుకు నిధులు మంజూరు చేసే బాధ్యత తనదే అన్నారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. గౌరవెల్లి, దేవాదుల, ఎస్సారెస్పీ, మిడ్ మానేర్ ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గానికి సాగునీరు అందేలా కృషిచేస్తామన్నారు. హుస్నాబాద్ నుంచి చేపలు మేకలు, గొర్లు హైదరాబాద్ కు ఎగుమతి చేసేలా ప్రత్యేక కృషిచేస్తామన్నారు. స్వశక్తి సంఘాల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటామని, నియోజక వర్గంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. గౌరవెల్లి, దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలకు వైద్య పరంగా సహాయం అందించేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానన్నారు. ఇందుకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేశానని చెప్పారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.
చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన రూట్ మ్యాప్ ను తయారు చేస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్లతో పాటు అడిషనల్కలెక్టర్లు గరిమా అగర్వాల్, ప్రఫుల్ దేశాయ్, రాధిక గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి, కిరణ్, వెంకటరెడ్డి, వివిధ శాఖల జి అధికారులు పాల్గొన్నారు.
ఆక్సీజన్ కొనుక్కునే పరిస్థితి తేవద్దు
భావితరాలు ఆక్సీజన్ కొనుక్కునే పరిస్థితి రాకుండా ప్రతిఒక్కరూ చెట్లను నాటి పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 75 ఏండ్ల వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్‌లోని మోడల్ స్కూల్లో చెట్లు నాటారు. ఆయన వెంట కలెక్టర్ మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు. కలెక్టర్ మనుచౌదరి తన పుట్టినరోజు సందర్భంగా చెట్టు నాటారు. అనంతరం టెన్త్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి, బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన స్టూడెంట్స్‌ను సన్మానించారు.