స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి : పొన్నం ప్రభాకర్

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి : పొన్నం ప్రభాకర్

కోహెడ(హుస్నాబాద్), వెలుగు: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని జిల్లెలగడ్డలో నిర్వహించిన హుస్నాబాద్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ గ్రామంలో పార్టీ జెండాను ఎగరవేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు రూ.126 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , రూ.500కు గ్యాస్ అందిస్తున్నామని, ఇవి ఎవరికైనా రాకపోతే గ్రామాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. 

రైతుకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్​కే దక్కుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. త్వరలోనే గౌరవెళ్లి కాల్వ పనులు పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని చెప్పారు. హుస్నాబాద్  ప్రాంతం నుంచి ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారికి టాంకాం కంపెనీ ద్వారా  శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేస్తామని హామీ ఇచ్చారు.

 ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ఇళ్ల పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అనంతరం క్యాంపు ఆఫీస్​లో మున్సిపల్​ కౌన్సిలర్లు, టౌన్​ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల యూత్​ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించారు. ఈ సమావేశంలో లైబ్రరీ చైర్మన్​ లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్​శివ్వయ్య తదితరులు ఉన్నారు.