- ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ప్రభుత్వం చేపడు తున్న సమగ్ర ఇంటింటి కుంటుంబ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని బీసీ వెల్ఫేర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. 2023 నవంబర్ 10న రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తుచేశారు. ఆ హామీ మేరకు ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్రంలో ‘ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే’ చేపట్టాలని కేబినెట్ తీర్మానించిందని తెలిపారు.
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను ప్లాన్ చేసి అమలు చేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరి 16న శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించినట్టు చెప్పారు. 85,000 మంది ఎన్యూమరేటర్లు, ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడిగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల పర్యవేక్షణలో నవంబర్ 30 లోపు కులగణన పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నన్నది మంత్రి చెప్పారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం జరుగుతున్న ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ ఈ సర్వేలో భాగస్వాములై సహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా కోరారు.