ఆఫీసులు కట్టకుండా ఇబ్బందులు తెచ్చిండ్రు : పొన్నం ప్రభాకర్​

ఆఫీసులు కట్టకుండా ఇబ్బందులు తెచ్చిండ్రు : పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : గత బీఆర్​ఎస్​పాలకులు ఇష్టారాజ్యంగా కొత్త మండలాలను ఏర్పాటు చేసి ఆఫీసులు నిర్మించకపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఇప్పుడు ఆ సమస్యలు తమ నెత్తిన పడ్డాయని, వాటిని కూడా పరిష్కరిస్తున్నామన్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో రూ.1.1 కోట్లతో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.  

కాంగ్రెస్​ వస్తే కరువొస్తోందని కొందరు దుష్ప్రచారాన్ని చేస్తున్నారని, కాంగ్రెస్​ వల్లనో, బీఆర్​ఎస్​ వల్లనో నీటి కరువు రాలేదన్నారు. గత సెప్టెంబర్​లో వానలు కురువకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య వస్తోందని చెప్పారు. అయినా ఆ సమస్యను అధిగమించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే తాను హుస్నాబాద్​ నియోజకవర్గంలో 307 హాబిటేషన్స్​లో పరిస్థితిపై అధికారులతో సమావేశం నిర్వహించానన్నారు. రూ.3.40 కోట్లు మంజూరు చేసి నీటి సమస్య రాకుండా చూశానన్నారు. ఎక్కడ నీటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు.

 నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నట్టు చెప్పారు. ఆర్టీసీలో 3,500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు. హుస్నాబాద్​ నియోజకవర్గంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లు ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. హుస్నాబాద్​లోని 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్​ని 250 పడకలుగా అప్​గ్రేడ్​ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు.