- బీజేపీ క్యాండిడేట్ బండి సంజయ్‌కి మంత్రి పొన్నం సవాల్
కరీంనగర్, వెలుగు : ‘కరీంనగర్ జిల్లాకు సంబంధం లేని వ్యక్తితో నా గురించి మాట్లాడిస్తున్నవు..ఆరోపణల్లో నిజం ఉంటే నీకు ఇష్ట దైవమైన మహాలక్ష్మి టెంపుల్‌కు తడి బట్టలతో రా’ అని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ క్యాండిడేట్ బండి సంజయ్‌కుమార్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. బండి సంజయ్ మాదిరిగా శానిటేషన్ కాంట్రాక్టర్ల వద్ద తాను పైసలు తినలేదన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి, రేకుర్తి, రాజీవ్ చౌక్ ప్రాంతాల్లో రోడ్డు షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ బండి సంజయ్ మాట్లాడితే హిందువులు అంటున్నారని.. కానీ శివాలయం, హనుమాన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కు ఏమైనా ఇచ్చారా ? అని ప్రశ్నించారు.
గతంలో నామినేషన్ పేపర్స్ కోసం భార్య మంగళసూత్రాలు అమ్ముకున్న సంజయ్‌కి ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. రాజేందర్‌రావు సంజయ్ మాదిరిగా అన్నామలై యూనివర్శిటీ అని రాసుకోలేదని ఎద్దేవా చేశారు. సంజయ్ అసలు టెన్త్ పాస్ అయ్యాడో.. ఫెయిల్ అయ్యాడో కూడా తెలియదన్నారు. సంజయ్‌కి హిందీ, ఇంగ్లీష్ రాదని, ఇక పార్లమెంట్‌లో ఏం మాట్లాడుతారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, రూ.500లకే సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. గ్యాస్ సిలిండర్ స్కీమ్‌లో ఇబ్బంది ఉంటే తహసీల్దార్ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పాత బకాయితో సహా చెల్లిస్తామన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి కింద మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పారు.
రోడ్‌షోలో మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు.