భీమదేవరపల్లి, వెలుగు : ‘అమిత్ షా మాటలను వక్రీకరించారని, సీఎం రేవంత్‌కు నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నరు. బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే సీఎంను అరెస్ట్ చేసి చూడండి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంగళవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ అమిత్ షా పై ఒక్క వీడియో వ స్తే భయపడిపోతున్నారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేపై ఎన్నో దొంగ వీడియోలు సృష్టిస్తే ఒక్క చర్య అయినా తీసుకున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్యా వందల సంఖ్యలో ఫేక్‌పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
కరీంనగర్ బీజేపీ అభ్యర్థి మతం పేరుతో పిల్లలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. రాముడి ఫొటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని, దమ్ముంటే ఎంపీగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో ఓట్లడగాలన్నారు. ఎంపీలుగా వినోద్ కుమార్, బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారో ముల్కనూరు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. త్వరలో గౌరవెల్లి రిజర్వాయర్ తో పాటు దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టులో రుణమాఫీ చేసి తీరతామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్కు ఓటు వేస్తే లాభం లేదని, దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే ఫలితం ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కొలుగూరి రాజు, ఆదరి రవీందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రే భిక్షపతి పాల్గొన్నారు.