హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకుంటే సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని జరుగుతోన్న ప్రచారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆదివారం (నవంబర్ 10) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సర్వే వల్ల ఎలాంటి సంక్షేమ పథకాల కోత ఉండదని.. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.
సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుందని.. అన్ని రకాల అసమానతలు తొలగించేందుకే ఈ సర్వే చేపట్టామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో పలుచోట్ల కొందరు సర్వేకు ఇబ్బందులు కలిగించారని.. అది సరైనది కాదని అన్నారు. కేవలం కులాల యొక్క జనాభా తెలుసుకొనేందుకే ఈ సర్వే చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. సర్వేలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే తెలంగాణలో చరిత్మాత్మక ఘట్టమని అభివర్ణించారు.