రాజకీయాలు వేరు.. సహకార సంఘాలు వేరు : పొన్నం ప్రభాకర్

రాజకీయాలు వేరు.. సహకార సంఘాలు వేరు : పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుగు: రాజకీయాలు వేరు.. సహకార సంఘాలు వేరని, క్రిబ్కో లో అన్ని పార్టీల వారు డైరెక్టర్లుగా ఉంటారని, అది రాజకీయాలకు సంబంధం లేకుండా రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తన రాజకీయ జీవితం కరీంనగర్ సిటీలో సహకార రంగం నుంచి మొదలైందని గుర్తు చేశారు. 

కరీంనగర్ లో శుక్రవారం నిర్వహించిన ది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ సర్వసభ్య సమావేశానికి మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  సహకార రంగంలో శ్రమ పడి రైతులకు నిజాయితీగా సేవ చేశానని తెలిపారు. తన తండ్రి రైతు అని, ఆయన పంట ఉత్పత్తి చేసి అమ్ముకోవడానికి పడిన ఇబ్బందులు తనకు తెలుసన్నారు. మార్క్ ఫెడ్ చైర్మన్ గా తాను అడగగానే వైఎస్ఆర్ రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని, మార్క్ ఫెడ్ గా అప్పు తీసుకోవడానికి జీవో ఇచ్చారని గుర్తు చేశారు. 

సహకార సంఘాల ద్వారా వరి, మొక్క జొన్న కొనాలని జీవోలు తెచ్చామని తెలిపారు. సహకార రంగంలో నలుగురికి సాయం చేసేలా కొండూరి రవీందర్ రావు, తాను పని చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేడీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీందర్ రావు మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించారు.