- లక్ష్మణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: మంత్రి పొన్నం
- సర్వే పూర్తయిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు వెళ్తం
- తెలంగాణకు ఏం చేశారో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పాలి
- మూసీకి వెళ్తాం.. బాధితులకు న్యాయం చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో చేపట్టిన కుల గణనకు బీజేపీ అనుకూలమా? లేక వ్యతిరేకమా? అనేది స్పష్టం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కుల గణనపై బీజేపీ నేత లక్ష్మణ్ మాటలు చూసిన తర్వాత ఆయన ఏ వర్గం నుంచి వచ్చారనేది తనకు అర్థంకాలేదని ఎద్దేవా చేశారు. బడుగు, బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వకున్నా.. వ్యతిరేకంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే కుల గణన జరుపుతున్నారని లక్ష్మణ్ ఆరోపిస్తున్నారని, శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు అయిపోయాయనే విషయాన్ని లక్ష్మణ్ గమనించాలని కోరారు. లక్ష్మణ్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం గాంధీ భవన్ లో పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల రిజర్వేషన్లు పెంచాలా? వద్దా? అనేది బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. కుల గణన సర్వే పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన బీజేపీ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బీసీ నేతను తొలగించి రెడ్డికి ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో 8 అసెంబ్లీ సీట్లు గెలిచినా.. బీజేఎల్పీ లీడర్ గా రెడ్డిని చేశారని ఎద్దేవా చేశారు.
వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతం
కుల గణన సర్వేలో ప్రభుత్వం సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని, ఈ సమాచారాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం ఉపయోగిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సామాజికంగా మార్పు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేస్తున్నదని తెలిపారు. గత ప్రభుత్వంలాగా సమగ్ర కుటుంబ సర్వే చేసి, దాన్ని అల్మారాలోనో, కోల్డ్ స్టోరేజీలోనో పెట్టబోమని, పబ్లిక్ డొమైన్ లో పెడతామని అన్నారు. బీఆర్ఎస్ కుల గణన సర్వే చేపట్టలేదని అన్నారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేకు మద్దతుగా నిలువాలని ప్రజలకు పొన్నం పిలుపునిచ్చారు. యూపీఎస్సీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 22.5 శాతం రిజర్వేషన్లు దాటడం లేదని, దానికి మోదీ విధానాలే కారణమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో 90 మంది ఐఏఎస్ లు ఉంటే, కేవలం ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పారు.
కేటీఆర్, హరీశ్‌రావు కోరినట్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కూలగొట్టిన ప్రాంతాలకు తాము వస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనలో ఎవరికీ అన్యాయం చేయబోమన్నారు. పునరావాస చట్టం ప్రకారం నిర్వాసితులకు చేయాల్సినవి అన్నీ చేస్తామని, చట్టానికి లోబడి వారిని ఒప్పించి, మెప్పించి ప్రక్షాళన చేస్తామని చెప్పారు.
టూరిజం మంత్రిగా కిషన్‌రెడ్డి ఏం చేశారు?
కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉండి హైదరాబాద్ కు ఏం చేశాడని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గతంలో టూరిజం మంత్రిగా ఆర్కియాలజీ కోసం ఏమైనా నిధులు తెచ్చారా? అని అడిగారు. దీనిపై సికింద్రాబాద్ టవర్ సర్కిల్ లో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి ప్రజంటేషన్ ఇచ్చి ఆదుకోవాలని కోరితే రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. కేటీఆర్ అరెస్టు కాకుండా స్నేహం చేసే లావాదేవీలు తమ వద్ద ఏమీ లేవని, తప్పు చేసిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
‘‘కేసీఆర్ ను జైల్లో పెడ్తం.. రూంలు కడ్తం అన్నది బండి సంజయ్. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ను అరెస్టు చేస్తాం అన్నది కేసీఆర్. ఇద్దరు వారు చెప్పినట్లు చేయలేదు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవితను అరెస్టు చేశారు. మరి ఎవరు, ఎవరిని కాపాడుతున్నారో ప్రజలకు అర్థమవుతున్నది. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ చేసింది మీరు కాదా?’’ అని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారని నిలదీశారు. రైల్వే ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కోసం నిధులు తెచ్చేందుకు చేతనైతే సహాయం చేయాలని, లేదా తమను ఢిల్లీకి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు.