సుంకిశాల ఘటనలో బాధ్యులను వదలం : పొన్నం ప్రభాకర్

సుంకిశాల ఘటనలో బాధ్యులను వదలం : పొన్నం ప్రభాకర్
  • గత సర్కార్​ వైఫల్యాల వల్లే ప్రాజెక్టు గోడ కూలింది

హనుమకొండ, వెలుగు: సుంకిశాల రిటైనింగ్‌‌ వాల్‌‌ కూలిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ ఘటనకు గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ నిర్వాకమే కారణమని మండిపడ్డారు. ‘‘గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఆ పార్టీ లీడర్లు కాంగ్రెస్​పై ఆరోపణలు చేస్తున్నరు.  విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నరు” అని ఆయన అన్నారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్​ఎస్​ హయాంలోనే రిటైనింగ్​ వాల్​ డిజైన్, ప్లాన్, నిర్మాణం జరిగిందని చెప్పారు. అప్పటి లోపభూయిష్ట విధానాలతోనే గోడ కూలి, దాదాపు రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అన్నారు.
 
అనవసర నిందలు వేస్తే ఊరుకోం

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోయిందని,  ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఇష్టారీతి న ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొన్నం  అన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్​ పదేండ్లు ఫామ్​హౌస్​ నుంచి బయటకు రాలేదని, విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. బాధ్యత గల ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇస్తే  స్వీక రించడానికి సిద్ధంగా ఉన్నామని, అనవసర నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్​ఎస్​ నేతలకు ఆయన హెచ్చరించారు.