కోహెడ (హుస్నాబాద్), వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని అందుకే కొన్ని స్కీమ్‌ల అమలుకు జాప్యం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన హుస్నాబాద్‌లో ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రైతులకిచ్చిన మాట ప్రకారం రూ,2లక్షల లోపు రుణాలను మాఫీ చేసిందన్నారు. రుణ మాఫీ కానీ రైతులు ఎవరైన ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
రూ.2 లక్షలు దాటిన రైతులు పైన ఉన్న డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేయడానికి ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీళ్లిచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మహా సముద్రం గండి, ఎల్లమ్మ చెరువు, సర్వాయి పాపన్న కోట, సింగరాయ జాతరలను టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ ప్రాంతంలో నెలకోల్పే పారిశ్రామిక కారిడార్‌కు చౌటపల్లి ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ సీఎం రోశయ్య వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, సింగిల్‌విండో చైర్మన్శివ్వయ్య, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.