- చెరువుల్లో వ్యర్థాలను తీస్తేనే నవరాత్రులకు సార్థకత
హుస్నాబాద్, వెలుగు: వినాయక నిమజ్జనం చేయగానే నవరాత్రి ఉత్సవాలు ముగియవని, చెరువుల నుంచి వ్యర్థాలను తొలగించినప్పుడే పరిపూర్ణంగా పండుగ జరిపినట్టవుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. మంగళవారం ఆయన హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువులో మున్సిపల్పాలకవర్గం, అధికారులతో కలిసి వ్యర్థాలను తొలగించారు. అనంతరం మినీస్టేడియాన్ని సందర్శించారు. క్రీడల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై క్రీడాకారులు, పీఈటీల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు.
స్టేడియంలో కబడ్డీ కోర్టును ప్రారంభించారు. క్రీడాకారులతో స్వచ్ఛత హీ సేవా ప్రతిజ్ఞ చేపించారు. మోడల్ స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, గిరిజన బాలికల హాస్టల్లో విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. హుస్నాబాద్లోఎస్సీ బాయ్స్ కాలేజీ హాస్టల్‌ను ఏర్పాటుచేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్దన్టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తితో కలిసి మంత్రికి వినతిపత్రాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్రజిత, వైస్ చైర్పర్సన్అనిత, ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.ఎస్సీ బాయ్స్కాలేజీ హాస్టల్‌ను ఏర్పాటు చేయాలె
పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి
సిద్దిపేట రూరల్: పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట కలెక్టరేట్ లో టీజీఐఐసీ అధికారులు, పారిశ్రామికవేత్తలు, అధికారుల తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్ధేశ్యంతో అక్కన్నపేట మండల కేంద్రంలో టీజీఐఐసీ ద్వారా 80 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
త్వరలోనే రూ.170 కోట్లతో హుస్నాబాద్, కరీంనగర్ ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం చేపడతామని, హుస్నాబాద్, జనగామ మధ్య ఫోర్ లైన్స్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి జిల్లా అధికార యంత్రాంగం తరపున పూర్తి సహకారం ఉంటుందని, ఎంఎస్ఎంఈ స్కీం ద్వారా ప్రోత్సాహం, ఇతర ప్రభుత్వ స్కీములను ఉపయోగించుకోవచ్చని, బ్యాంకులతో సమన్వయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ కుమార్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట,హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి పాల్గొన్నారు.