హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో బీజేపీ గెలవడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంతో ఆనందంగా ఉన్నట్టు ఆయన మాటల తీరును చూస్తే తెలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. శనివారం బీజేపీ గెలుపుపై రాహుల్ ను ఉద్దేశించి కేటీఆర్ చేసిన ట్వీట్ పై పొన్నం ‘ఎక్స్’ వేదికగానే స్పందించారు. కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీ అండ చూసుకుని ఇష్టానుసారంగా దోచుకొని తిన్న కేటీఆర్.. అధికారం కోల్పోయిన తర్వాత కేసుల నుంచి విముక్తి పొందేందుకు బీజేపీ భజన చేస్తున్నాడని విమర్శించారు. దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు మార్చుకున్న బీఆర్ఎస్ ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కడికి పోయిందని నిలదీశారు. ఇంతకు ముందు మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే శునకానందం పొందిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో సంబురాలు చేసుకుంటుందని పేర్కొన్నారు.