మోదీ మాటలు ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నయ్​ : మంత్రి పొన్నం ప్రభాకర్​

మోదీ మాటలు ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నయ్​  : మంత్రి పొన్నం ప్రభాకర్​

రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: అబ్ కీ బార్ చార్ సౌ అంటున్న బీజేపీ.. ఈసారి 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిరిసిల్లలో మేడే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన తర్వాత డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. వారం రోజులుగా మోదీ మాటలు  ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నాయన్నారు. ఆయన కాంగ్రెస్‌పై దుష్ర్పచారం చేస్తూ దిగజారి మాట్లాడుతున్నారన్నారు. మొదటి, రెండో దశ పోలింగ్ తర్వాత మోదీలో అసహనం కనిపిస్తోందన్నారు. 

దేశంలోని మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఇప్పటికే మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈనెల 3న సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు రానున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే సభను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సక్సెస్ చేయాలని పిలుపినిచ్చారు. వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు.అలాగే వేములవాడలో పార్టీ ఆఫీసును ప్రారంభించిన పొన్నం మాట్లాడుతూ రాజన్న సాక్షిగా జిల్లా అభివృద్ధికి బండి సంజయ్​ ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు.