328 కేంద్రాల్లో పత్తిని కేంద్రమే కొనుగోలు చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

328 కేంద్రాల్లో పత్తిని కేంద్రమే కొనుగోలు చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
  • ఆ దిశగా సెంట్రల్​మినిస్టర్లు కృషి చేయండి 
  • రైతులను ఇబ్బందికి గురి చేస్తే  కఠిన చర్యలు
  • ఆయిల్​పామ్​సాగుపై దృష్టి పెట్టండి 
  • మంచి లాభాలు వస్తాయ్​
  • హుస్నాబాద్​లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్​ 

హుస్నాబాద్:  రాష్ట్రంలో 328 కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసే విధంగా కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్​ కృషి చేయాలని  మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం​లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   పత్తి, దాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులను తరుగు, తేమ పేరిట ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ సీజన్​ నుంచి సన్న వడ్లకు రూ. 500 బోనస్​ను ప్రభుత్వం ఇస్తుందన్నారు.  తూకం పేరిట రైతులను మోసం చేసే వ్యాపారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.  డిసెంబర్​నెలాలోపు రూ. 2 లక్షల రుణమాఫీ అర్హులైన రైతులు అందిస్తామన్నారు.  రూ 2లక్షలు పైన ఉన్న రైతుల కోసం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా  రైతులు ఇబ్బంది లేకుండా పత్తి, ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు.   రైతులు ఆయిల్ పామ్ తోటల పెంపకం పై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

ఆయిల్​పామ్​సాగుతో అధిక లాభాలు వస్తాయన్నారు. ఆయిల్​పామ్​లో అంతరపంటలను సైతం సాగు చేసుకోవచ్చన్నారు.   కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని అన్నారు. రైతుల కోసం సాంకేతిక పరమైన పనిముట్ల అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.