
మే 7నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నోటిసుపై స్పందించిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మె నిర్ణయంపై పునరాలోచించాలని అన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చామని.. ప్రస్తుతం సమ్మె చేయాల్సిన పరిస్థితిలో ఆర్టీసీ లేదని అన్నారు పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఆర్టీసీ కార్మికుల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ పరిరక్షణ అంశాలపై కట్టుబడి ఉన్నామని అన్నారు. గత పదేళ్ళలో ఆర్టీసీలో పెండింగ్ పీఎఫ్ బకాయిలను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.
సమ్మెపై ఇప్పటివరకు శాఖ మంత్రిగా తనను ఎవరూ కలవలేదని.. డైరెక్ట్ గా లేబర్ కమిషన్ ను కలిసి నోటీస్ అందజేశారని అన్నారు. ఉద్యమకారుడిగా తనకు ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం ఉందని.. ఆర్టీసీ కార్మికులతో సమాలోచనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు పొన్నం ప్రభాకర్. సమ్మెకు పోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని...ఆర్టీసీ రెండు ప్రధాన అంశాలు ముఖ్యమంత్రి నోటీసులో ఉన్నాయని.. వాటిని కూర్చొని మాట్లాడుకుంటామని అన్నారు.
►ALSO READ | రాహుల్ డిమాండ్తోనే..కులగణనకు కేంద్రం ఒప్పుకుంది: సీఎం రేవంత్ రెడ్డి
ఇది సమ్మెకు పోయే కాలం కాదని.. ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ఇది సమ్మె సమయం కాదని అన్నారు పొన్నం ప్రభాకర్. రూ. 1562 కోట్ల పీఎఫ్ కాయలను 600 కోట్లకు తగ్గించామని.. సిసిఎస్ బకాలను పూర్తిగా తగ్గించేసామని అన్నారు. రిటైర్మెంట్ అయిన రోజే వారి బెనిఫిట్స్ ఇచ్చేలా కార్యాచరణ చేస్తున్నామని అన్నారు. సంస్థ నిలబడాలని.. ఆర్టీసీ 40,000 కుటుంబాలు బాగుపడాలని కోరుకునే ప్రభుత్వం తమదని అన్నారు.