జూబ్లీ బస్టాండ్​ను పరిశీలించిన మంత్రి పొన్నం

జూబ్లీ బస్టాండ్​ను పరిశీలించిన మంత్రి పొన్నం

సికింద్రాబాద్, వెలుగు:  జూబ్లీ బస్టాండ్​ను మంత్రి పొన్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టాయిలెట్లు పరిశీలించారు. శానిటేషన్ సిబ్బందితో మాట్లాడారు. బస్టాండ్ పరిసరాలను క్లీన్​గా ఉంచాలని ఆదేశించారు. టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలన్నారు. ఆ తర్వాత బస్టాండ్​లోని వివిధ స్టాళ్లను తనిఖీ చేశారు. అక్కడ విక్రయించే వస్తువుల నాణ్యత, ధరలపై ఆరా తీశారు. తినే వస్తువుల్లో నాణ్యత పాటించాలని దుకాణదారులకు సూచించారు. 

కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్నారు. క్యాంటీన్​కు వెళ్లి కండక్టర్లు, డ్రైవర్లతో మాట్లాడారు. ఆ తర్వాత ప్లాట్​ఫామ్ పైకి వెళ్లగా.. డిస్ ప్లే బోర్డులు సరిగా లేవని ప్రయాణికులు ఫిర్యాదు చేయగా.. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కార్గో సెంటర్​ను సందర్శించారు.