
కరీంనగర్: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాలు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దొంగల సభగా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆదివారం (మార్చి 23) ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌కి తమిళనాడులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం దొంగల సభ లాగా కనిపించడం దురదృష్టకరమని.. ఆయనకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనట్లు అనిపిస్తుందని అని అన్నారు.
ALSO READ | అన్యాయాన్ని ఎదిరిద్దాం
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గిస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. పెరగబోయే పార్లమెంటు నియోజక వర్గాల సంఖ్య ప్రస్తుతం ఉన్న సంఖ్యకు అనుగుణంగా ఉండాలని.. దక్షిణాదిలో జనాభా తగ్గిందనే కారణంగా సీట్లు తగ్గిస్తే మంచిది కాదని పేర్కొన్నారు. లేదంటే 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో పెరిగిన సంఖ్యకి అనుగుణంగా తెలంగాణలో ఎంపీ సీట్లు పెరుగుతాయా లేదా బండి సంజయ్ చెప్పాలని నిలదీశారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కేటీఆర్ కరీంనగర్‌కు రావడం బాగానే ఉంది. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ కరీంనగర్లో పుట్టింది వాస్తవమే. కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు మూడుసార్లు గెలిపించింది కూడా నిజమే. కానీ కరీంనగర్ జిల్లాకు ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సీట్లలో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారన్నారు.