
హన్మకొండ: సోనియా గాంధీ లేకపోతే 100 మంది కేసీఆర్లు వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని బల్లగుద్ది చెబుతున్నానని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రదాత అని.. అందుకే ఆమెకు పాలాభిషేకం చేశామని తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని.. ఆమే తెలంగాణ ఇచ్చిందని మీరే శాసన సభలో అనేక సందర్భాల్లో చెప్పారని కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి ఎన్ని అష్టకష్టాలు పడ్డాదో ప్రత్యక్షంగా మీకు తెలుసని అన్నారు.
యూపీఏ కూటమి మిత్రపక్షాలను ఒప్పించడంలో ఆంధ్రప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇబ్బంది పెట్టిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ సహకరించారని గుర్తు చేశారు. మీలాగా అగ్గిపెట్టె రాజకీయాలు చేసి.. అమాయకులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించినట్టు కాదని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎంతో మంది బలిదానం చేశారని.. అమరులకు ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు శాసన సభ తిరస్కరించినా, ఆంధ్రా నాయకులు వ్యతిరేకించినా.. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు.