- దమ్ముంటే మోదీ ఫొటో పెట్టుకుని ఓట్లు అడగాలి
- ప్రసాద్ స్కీమ్‌లో వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి నిధులు ఎందుకు తేలే ?
- కరీంనగర్‌లో ఓటు అడిగే అర్హత వినోద్‌కుమార్‌కు లేదు
కరీంనగర్, వెలుగు : బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో రాముడి పేరుతో ఓట్లు అడుగుతోందని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రధాని మోదీ ఫొటో పెట్టుకుని ఓట్లు అడగాలని సవాల్ చేశారు. తానెప్పుడు రాముడి జన్మ గురించి మాట్లాడలేదని, తామంతా రాముడి భక్తులమేనన్నారు. అందరి జన్మల గురించి, తల్లుల గురించి మాట్లాడిన నీచ స్థాయి బండి సంజయ్‌దని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిమ్మాపూర్ మండలం అలుగనూరు, హుజూరాబాద్‌లో జరిగిన మానకొండూరు, హుజూర్‌నగర్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
బండి సంజయ్ ఎంపీగా గెలిచాక ఒక్కసారి కూడా గ్రామాల్లో తిరగలేదన్నారు. జిల్లాతో సంబంధం లేని వినోద్‌కుమార్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. ఆగస్టు 15లోపు రుణమాఫీచేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం అమలుచేస్తున్న ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలకు నిధులు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. దేశం కోసం కాంగ్రెస్ ప్రారంభించిన అనేక భారీ పరిశ్రమలను మోదీ ప్రస్తుతం ఆదానీ, అంబానీకి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం బాండ్ల రూపంలో అవినీతికి పాల్పడుతోందని, శరత్ చంద్రారెడ్డి రూ.500 కోట్లు బీజేపీకి ఇవ్వడం వల్లే ఆయనకు బెయిల్ వచ్చిందన్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేదన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాళ్లు కనిపిస్తే దంచాలని సూచించారు.
సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కరీంనగర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జులు పురుమల్ల శ్రీనివాస్, వొడితల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణగౌడ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి పాల్గొన్నారు.