
- తెలంగాణకు అన్యాయం చేసే పరిస్థితి తెస్తే తిప్పి కొడతం
- అంబర్పేటలో అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
అంబర్పేట, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదన్నారు.
రాష్ట్రానికి అన్యాయం చేసే పరిస్థితి తెస్తే తిప్పి కొడతామని హెచ్చరించారు. గురువారం అంబర్పేట నియోజకవర్గంలోని బాగ్ అంబర్పేట, నల్లకుంట, బర్కత్పురా ప్రాంతాల్లో రూ.4.90 కోట్ల అభివృద్ధి పనులకు మాజీ ఎంపీ వీహెచ్, కాంగ్రెస్ ఇన్చార్జ్రోహిన్రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.
.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాల్సిందేనన్నారు. అడ్డుపడుతున్న వారు ఇప్పటికైనా తెలంగాణ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలే చూసుకుంటారని హెచ్చరించారు. అలాగే అంబర్పేటలో ఏర్పాటు చేసిన ఈస్ట్జోన్డీసీపీ ఆఫీసును మంత్రి పొన్నం ప్రభాకర్ప్రారంభించారు. సిటీ సీపీ సీవీ ఆనంద్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, పోలీస్ఉన్నతాధికారులు పాల్గొన్నారు.