శివరాత్రి జాతర ఘనంగా నిర్వహిస్తాం : పొన్నం ప్రభాకర్

  •     వేములవాడను శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి
  •     500 అతిథిగృహాలు నిర్మించేలా ప్లాన్​ 
  •     ప్రత్యేక పాసుల విధానం రద్దు... ప్రత్యేక దర్శనానికి రూ.300 టికెట్ల జారీ
  •     రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
  •      జాతరపై  అధికారులతో రివ్యూ

వేములవాడ, వెలుగు :   మహాశివరాత్రి జాతర  ఘనంగా నిర్వహించేందుకు  చర్యలు తీసుకోవాలని  మంత్రి పొన్నం ప్రభాకర్  అధికారులను ఆదేశించారు. బుధవారం వేములవాడ రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్ లో  ఆది శ్రీనివాస్ తో  మహ శివరాత్రి జాతర సమన్వయ  సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ  వేములవాడ ఆలయంలో జరిగే పూజల్లో  ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని,   స్వామి వారి పూజలు ఘనంగా జరగాలని చెప్పారు.  

భక్తులకు త్వరగా దర్శనం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శివరాత్రి జాతర సందర్భంగా మార్చి 7 నుంచి మార్చి 9 వరకు వేములవాడకు  ఎక్కువ బస్సు సర్వీసులు నడపాలని, మహాలక్ష్మీ పథకం నేపథ్యంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నందున అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.   తతత అదనపు సర్వీసులు నడపడం ద్వారా  భక్తులకు ఇబ్బందులు రావన్నారు.   ఆలయ పరిసరాల్లో తా గునీటి ఇబ్బందులు కలగకుండా  ఏర్పాట్లు చేయాలని, ఆలయ చుట్టుపక్కల  మూడు షిఫ్ట్ లో పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించి, శుభ్రతను పాటించాలన్నారు.  హెల్త్​ క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు

ప్రత్యేక పాసులు రద్దు..  

 మహాశివరాత్రి జాతర సందర్భంగా గతంలో అందించే ప్రత్యేక పాసులను పూర్తిస్థాయిలో రద్దు చేస్తున్నామని, వాటి స్థానంలో ప్రత్యేక దర్శనానికి రూ.300 టికెట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేములవాడలో సైతం బ్రేక్ దర్శనం, అభిషేకం కుంకుమ పూజలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని సేవల వివరాల ఆన్​లైన్​లో పెట్టాలని చెప్పారు. దాతల సహాయంతో అందుబాటులో ఉన్న స్థలంలో భక్తుల కోసం 500 గదులతో అతిథి గృహలను నిర్మించాలన్నారు.  అనంతరం రాజన్న ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సమావేశంలో కలెక్టర్​ అనురాగ్​ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్,డీఎస్పీ నాగేంద్ర చారి, ఈఓ  కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

మహాశివరాత్రి జాతరను   పని చేసే విజయవంతంగా నిర్వహించాలని, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా వేములవాడ పట్టణాన్ని సుందరీకరించాలని ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​  ఆదేశించారు.  వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత దుర్వాసన ఉండకుండా చర్యలు తీసుకోవాలని, జాతర సమయంలో కట్టుదిట్టమైన భద్రత   ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.   

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, జాతర నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆలయంలో భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా క్యూలైన్ నిర్వహించాలని, భక్తులతో సిబ్బంది   దురుసుగా ప్రవర్తించవద్దన్నారు.  జాతర తర్వాత వేములవాడ  శైవ క్షేత్రాన్ని శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.