జులై 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఆషాఢ బోనాలకు రూ.20 కోట్లు

జులై 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఆషాఢ బోనాలకు రూ.20 కోట్లు

 

హైదరాబాద్/​పంజాగుట్ట, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మతల్లి కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ​ఆదేశించారు. జులై 8 నుంచి 10 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. జులై 8న ఎదుర్కోలు, 9న ఎల్లమ్మతల్లి కల్యాణ మహోత్సవం, 10న అమ్మవారి రథోత్సవం జరుగుతాయని వెల్లడించారు. మంగళవారం ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉన్నందు వల్ల అమ్మవారి కల్యాణానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తారని, వారికీ తాగునీరు, వైద్య సదుపాయం వంటి సౌకర్యాలు అందించాలన్నారు. 

ట్రాఫిక్​కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆషాఢ బోనాలకు ప్రభుత్వం రూ.20  కోట్లు కేటాయించిందని తెలిపారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం రూ.15 కోట్లు మాత్రమే కేటాయించగా.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చొరవతో మరో రూ.5 కోట్లు పెంచామని మంత్రి చెప్పారు. గత బోనాల సమయంలో వీవీఐపీ పాసులు అధికంగా ఇవ్వడం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఈసారి ప్రతి గుడిలో వీవీఐపీ పాసులు తగ్గేలా దేవాదాయ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.