వేములవాడలో నిత్యాన్నదానం..ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నం

  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌
  • సత్రం కోసం మంత్రి రూ. 45 లక్షలు, విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌ రూ. 10 లక్షల విరాళం

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం అని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ చెప్పారు. ప్రభుత్వ విప్‌‌లు ఆది శ్రీనివాస్‌‌, అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌తో కలిసి సోమవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనం చేయగా, ఈవో వినోద్‌‌రెడ్డి స్వామి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ గెస్ట్‌‌హౌజ్‌‌లో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. రాజన్న ఆలయంలో అన్నదాన సత్రం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌‌రెడ్డిని కోరగానే రూ.35 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారన్నారు. 

నిత్యాన్నదాన సత్రానికి తన కుటుంబసభ్యుల తరఫున రూ.45 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్నదాన ట్రస్ట్‌‌లో ఇప్పటికే రూ. 20కోట్లు ఉన్నాయని, వాటిని రూ.100 కోట్లకు పెంచేందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. రాజన్న కోసం భక్తులు విరాళాలు ఇవ్వాలని, హైదరాబాద్‌‌లోనూ దాతల నుంచి విరాళాలు సేకరిస్తామని చెప్పారు.

వేములవాడ నుంచి హైదరాబాద్‌‌కు ఏసీ బస్‌‌ సర్వీస్‌‌ను ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌ మాట్లాడుతూ నిత్యాన్నదాన సత్రానికి తన కుటుంబసభ్యుల తరఫున రూ.10 లక్షలు విరాళం అందించనున్నట్లు ప్రకటించారు. ఆలయ విస్తీర్ణం, రోడ్ల వెడల్పు, అన్నదాన సత్రం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.