రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. శ్రమపడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి రామోజీరావు నిదర్శనమని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాబోయే తరానికి ఆయనోక మార్గదర్శి అని కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తాను రామోజీరావును దగ్గరి నుండి చూసానని.. వారి జీవితం అదర్శమైందన్నారు.
రామోజీ రావు మృతి మీడియా వ్యవస్థలో తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సామాన్య రైతుకుటుంబంలో జన్మించి రెండు రాష్ట్రాలకు రామోజీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల్లో రామోజీ ఒకరన్నారు. అన్ని రంగాల్లో రామోజీ తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు.
రామోజీరావు మరణం తనను ఎంతో కలచివేసిందని... ఆయన తనకు ఎంతో సన్నిహితులు, హితులు, ఆప్తులు అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్. రామోజీ రావు మృతిపట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటుగాఅభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధించారు.