- ఫామ్ హౌస్ నుంచి కాదు.. సెక్రటేరియెట్ నుంచి ప్రజాపాలన అందిస్తున్నం
- నియంతలా కాకుండా ప్రజల అభిప్రాయలను స్వీకరిస్తున్నమని వెల్లడి
- గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాం
- 179 అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చినా.. బీఆర్ఎస్ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తాము ఫామ్ హౌస్ నుంచి కాకుండా సెక్రటేరియెట్ నుంచి ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పారు. నియంతలా తాము చెప్పిందే వినాలని కాకుండా.. అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో పాలన అందిస్తున్నామని తెలిపారు. బుధవారం గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాంలో పొన్నం పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి ఆర్జీలు తీసుకున్నారు. వారి సమస్యలను ఓపికగా విని.. పలు సమస్యలపై అప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించాలని సూచించారు.
అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడారు. ఎక్స్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు కేటీఆర్ చేసిన ట్వీట్ పై పొన్నం మండిపడ్డారు. తమపై ఎవరు ఎన్ని సెటైర్లు వేసినా తాము పట్టించుకోమని, తమ పని తాము చేసుకుపోతామన్నారు. అసత్య ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. పదేండ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై పూర్తి సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. విదేశీ విద్యానిధి గత ప్రభుత్వం 150 మందికి ఇస్తే.. తాము 500 మందికి ఇచ్చామన్నారు. తాము చేస్తున్న పనిని ప్రజలకు చెప్పడానికి ట్వీట్ తో అవకాశం ఇచ్చిన కేటీఆర్‌కు పొన్నం ధన్యవాదాలు చెప్పారు. అధికారం పోయిందని కేటీఆర్ అసహనంగా మాట్లాడుతుండని ఎద్దేవా చేశారు.
శుక్రవారం నాటి ప్రోగ్రామ్ రద్దు..
దసరా పండుగ సందర్భంగా శుక్రవారం జరగాల్సిన మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్ ను రద్దు చేశామని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. మళ్లీ వచ్చే బుధవారమే తిరిగి ఈ ప్రోగ్రామ్ ఉంటుందని ప్రకటించారు.
మీ పాలన గురించి తెలిసే ఇంటికి పంపారు..
తమ పది నెలల పాలనపై చర్చకు సిద్ధమా అంటున్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపైనా పొన్నం ఫైర్ అయ్యారు. అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? అని ప్రశ్నించారు. పదేండ్లు ఎలా పాలించారో ప్రజలకు తెలుసు కాబట్టే.. మిమ్మల్ని ఇంటికి పంపారని చెప్పారు. మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాం వినూత్న కార్యక్రమమని చెప్పారు. మొత్తం 179 అర్జీలు అందాయని, అందులో రవాణా శాఖకు సంబంధించినవి 42, వివిధ మంత్రులకు సంబంధించినవి 115, కలెక్టర్ ల ద్వారా పరిష్కారం అయ్యేవి 22 వచ్చాయని గాంధీ భవన్ వర్గాలు చెప్పాయి. ఈ ప్రోగ్రాంలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.