
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికలను ఉదాసీనంగా తీసుకోవద్దని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం (ఫిబ్రవరి 23) వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ కన్వేక్షన్ హల్లో అర్బన్ మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి విశ్వ నాథన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలలుగా మనం చేసిన అభివృద్ధి పనులు పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎమ్మెల్సీ ఎన్నికను బాధ్యతగా తీసుకొని.. ప్రతి ఓటర్ను కలిసి వాళ్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేలా కృషి చేయాలని సూచించారు.
ఒకసారి ఓటరు కాంగ్రెస్ పార్టీ కాదని ఓటు వేరే పార్టీకి వేస్తే.. అది మీకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది వస్తోందని.. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికల రిహార్సల్ అనుకుని పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. మీ ఊర్లో ఉన్న పట్టభద్రులను కాంగ్రెస్ వైపు తిప్పి.. వాళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేసే బాధ్యత స్థానిక నాయకులదేనని అన్నారు. బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది.. మరీ ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వేములవాడకు నిధులు తీసుకొస్తా అన్నాడు.. ఇప్పటి వరకు ఎన్ని ఫండ్స్ తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేం అధికారంలోకి రాగానే వేములవాడ ఆలయ అభివృద్ధి, మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్య, సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్య లు పరిష్కారం చేస్తున్నామన్నారు.
మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే.. బీజేపీ హిందువుల పేరుతో జనాన్ని రెచ్చగొడుతోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగల చేసి చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంటే.. బీసీల్లో ముస్లింలు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాతే ఈబీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చారు. మోడీ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలను బీసీల్లో చేర్పించా అని చెప్పారూ.. మరీ వాళ్లు చేస్తే ఒప్పు మేం చేస్తే తప్పా అని బీజేపీ నేతలను నిలదీశారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఒక గంట ముందే ఇంటికి పోయే వెసులు బాటు కల్పిస్తే.. బీజేపీ నేతలు దానిని కూడా రాజకీయం చేస్తున్నారని.. మరీ తెలంగాణ పొరుగు రాష్ట్రం ఏపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది.
అక్కడి ప్రభుత్వం కూడా మనకంటే ముందే ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఇంటికి పోయే అవకాశం కల్పించింది. మరీ దీనిపై బండి సంజయ్ ఏమంటారని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రమంత్రిగా ఉండి సిరిసిల్ల ప్రాంతంలో టెక్స్టైల్ కార్మికుల కోసం ఏం చేశావని నిలదీశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిదని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం (ఫిబ్రవరి 24) సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కి వస్తున్నారని.. పట్టభద్రులు పెద్ద ఎత్తున హాజరై సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.