ఇక్కడకొచ్చి తొడకొడితే నడవదు.. మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్

ఇక్కడకొచ్చి తొడకొడితే నడవదు.. మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్ఎస్ పార్టీ డాక్టరేట్ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 80 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ ఎల్పీని ఆ పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు ఫిరాయింపులు గుర్తుకు రాలేదా? అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.  శనివారం గాంధీభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్​ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ఒక దళితుడు ప్రతిపక్ష నేత అయితే ఓర్వలేకనే కేసీఆర్‌‌‌‌ ఫిరాయింపులను ప్రోత్సహించారని ఆరోపించారు. ఎక్కడో విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి పెత్తనం చెలాయిస్తామంటూ తొడకొడితే నడవదని హెచ్చరించారు. ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చిన పార్టీ చేసే విమర్శలను కాంగ్రెస్​కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పొన్నం పిలుపునిచ్చారు.

నియంతృత్వపాలకు స్వస్తి చెప్పినం

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ ను జ్యోతిబాఫూలే ప్రజాభవన్ గా మార్చామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. ప్రగతి భవన్ ముందున్న ముళ్ల కంచెలను తొలగించి, నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పామని, ప్రజాస్వామ్యయుత పాలనకు దారులు తెరిచామని అన్నారు. నిషేధిత ప్రాంతంగా ఉన్న ఇందిరా పార్కు వద్ద ప్రజాస్వామ్యపద్ధతిలో  ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేసుకునే అవకాశం కల్పించామని గుర్తు చేశారు.

 ఇలాంటి ప్రజా పాలనకు ఆకర్షితులై  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  వ్యాఖ్యలు ఆంధ్రావారిని రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇందుకు సంబంధించిన వీడియోను కేటీఆర్ కు పంపుతానని అన్నారు.  కేసీఆర్ కూడా గతంలో ఆంధ్రా ప్రాంతం వారికి వ్యతిరేకంగా మాట్లాడారని తెలిపారు. ‘మాది బిర్యానీ.. మీది పెండ’ అని అన్నారని గుర్తుచేశారు. 

కలహాలు సృష్టించి హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల ఇండ్లపై దాడులు మంచి సంస్కృతి కాదని అన్నారు. కాంగ్రెస్ టాలెంటెడ్ పార్టీ అని, ఎవరూ చెప్పాల్సిన అవరం లేదని తెలిపారు. పదేండ్లు పాలించిన వాళ్లు కనీసం పది నెలలు కూడా ఓపిక పట్టడం లేదని, దీనిని అసహనం అని అనకుండా మరేమంటారని ప్రశ్నించారు.