మీ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా?

మీ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా?
  • ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఎలా ఇవ్వరో చూస్తాం..  
  • బండి సంజయ్​పై మంత్రి పొన్నం ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా.. ఎలా ఇవ్వరో తాము చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం గాంధీభవన్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మను అవహేళన చేస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 10 నెలల కాలంలో జీఎస్టీ రూపంలో రూ.37 వేల కోట్లను కేంద్రం వసూలు చేసిందని, మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చిందెంత.. ? అని ప్రశ్నించారు.

దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి వంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారని, వీల్లేమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా అని నిలదీశారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా.. ఒక్క రూపాయన్న కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా..? అని మంత్రి ధ్వజమెత్తారు. ఇందిరమ్మను ఇంకొక్క మాట అన్న భారతీయులు ఊరుకోరన్నారు. రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలు ఉండాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం 

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇబ్బందులెన్ని ఎదురైనా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తు ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జీర్ణం కావడం లేదని.. ఆయనకు ఈనో ప్యాకెట్టు పంపిస్తానని ఎద్దేవా చేశారు. అసహనానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పరాకాష్టగా మారారన్నారు.