- ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.15 లక్షలు వేశారా?
- విభజన హామీలు కేంద్రం అమలు చేయలే
- ప్రజలకు ఏం చేశావో చెప్పి ఓట్లు అడగాలని సంజయ్ కు సవాల్
- కరీంనగర్ లో మంత్రి నిరసన దీక్ష
కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే బీజేపీ నేతలు పదేండ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని, ఇచ్చిన హామీలను అమలు చేసి తమ గ్యారంటీలపై ప్రశ్నించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘అధికారంలోకి వస్తే నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి, ప్రతీ వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పి నరేంద్ర మోదీ ప్రభుత్వం మాట తప్పింది” అని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకపోవడంపై మంత్రి పొన్నం కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు.
ముందుగా బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సంపదను అంబానీ, అదానీకి దోచి పెడుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేస్తూ వెయ్యి మంది రైతులు చనిపోయినా బీజేపీ నేతలు స్పందించలేదని, ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతున్నారని ఆయన నిలదీశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీ పంచవర్ష ప్రణాళికల ద్వారా పరిశ్రమలు తీసుకొస్తే..
ఆ పరిశ్రమలను ఈరోజు అదానీ, అంబానీలకు ప్రధాని నరేంద్ర మోదీ ధారదత్తం చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమపై 12 శాతం జీఎస్టీ వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమే. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానిస్తుంటే.. పార్లమెంటులో ఉన్న నువ్వు (సంజయ్) నోరు ఎందుకు మెదపలేదు? సంజయ్ నా తల్లి గురించి మాట్లాడి తన సమాధిని తనే కట్టుకుండు. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పాస్ పోర్ట్ ఆఫీసు, తిరుపతికి రైలు, ఎఫ్ఎం రేడియో స్టేషన్, కేంద్రీయ విద్యాలయం మోడల్ స్కూల్ తీసుకువచ్చిన.
నువ్వు (సంజయ్) ఏం తీసుకోవచ్చావో ప్రజలకు చెప్పి ఓట్లు అడుగు’’ అని పొన్నం వ్యాఖ్యానించారు. దీక్షలో మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.