సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ఆశీర్వచనం అందరి పై ఉండాలని కోరుకున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అమ్మవారుల ఆశీర్వచనం, ప్రజల దీవెనలతోటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాపాలన ఏర్పడినదని చెప్పారు. ప్రజా పాలన మీద ప్రజల పరిపాలన మీద కొంతమంది 70 రోజులు కాకముందే ప్రగల్బాలు పలుకుతున్నారని తెలిపారు. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
ప్రభుత్వం కూలిపోతుందని ఒకడు.. కూలగొడతామని మరొకడు ఏదిపడితే అది నూటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారం ఉండీ తెలంగాణకు ఏం చేసిందో గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పాలని ప్రశ్నించారు. పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తుందని విమర్శించారు. డబల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి, దళిత ముఖ్యమంత్రి నెరవేర్చలేదని ప్రజలు వేలెత్తి చూపుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే ముల్లెకంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాపల పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు పొన్నం ప్రభాకర్.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి మంత్రి హోదాలో తొలిసారిగా వచ్చిన బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో వనదేవతలను మంత్రి పొన్నం ప్రభాకర్ జాతర కమిటీ ధర్మకర్త పాడి ఉదయానంద్ రెడ్డి దర్శించుకున్నారు.